ఫిల్లోక్రాన్లు, వరి దిగిబడులు

శ్రీ పద్ధతిలో నాటు వేసిన 4-5 వారాల వరకు చూడటానికి అసలు బాగుండదు. మొక్కలు పిలగా, దూర దూరంగా వుంటాయి. నీళ్ళు కూడా లేకుండా నేల ఎండిపోయినట్లు వుంటుంది. అయితే ఈ కాలంలో మొక్క పిలకలు తొడగటానికి తయారు అవుతుంది.  రెండో నెలలో పిలకలు వేయటం మొదలయ్యి, మూడో నెలలో ఇబ్బడి ముబ్బడిగా పిలకలు పెడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం చేసుకోవటానికి ఫిల్లోక్రాన్లు గురించి అర్ధం చేసుకోవాలి.

ఫిల్లోక్రాన్లు, అనేది ఒక ఆకూ, వేరు వేయటానికి పట్టే సమయం. ప్రధానంగా వాతావరణ ఉష్ణోగ్రతను బట్టి, తరువాత పగటి పొద్దు, గాలిలో తేమ, నేలలో తేమ, నేల వదులు, పోషకాల అందుబాటు, గాలి, వెలుతురు సోకటం వంటి వాటి బట్టి ఫిల్లోక్రాన్లు, దశ వుంటుంది. అన్ని పరిస్థితుల అనుకూలంగా వుంటే 5 రోజులలో ఒక ఫిల్లోక్రాన్లు దశ ముగుస్తుంది. లేదంటే 6-7 రోజులు లేదా ఇంకా ఎక్కువ పట్టవచ్చు. వరి మొక్క శాఖీయ దశ పూర్తి చేసుకుని, చిరు పొట్ట తగిలే నాటికీ 12 ఫిల్లోక్రాన్లు దశలు పూర్తి చేస్తే మంచిది. కొత్త పిలక రెండు ఫిల్లోక్రాన్లు దశలు పూర్తి చేసుకుంటే అది కూడా పిలకలు పెట్టడం మొదలు పెడుతుంది. అంటే కొత్త పిలకల సంఖ్య  వేగంగా పెరుగుతుంది.

          విత్తనం మొలకెత్తింది మొదటి ఫిల్లోక్రాన్లు దశ అనుకుంటే, రెండు, మూడు ఫిల్లోక్రాన్లు, దశలలో నాటు వేయడం మంచిది. దీనివల్ల 4వ ఫిల్లోక్రాన్లు దశలో వేగంగా జరిగే ఎదుగుదలకు అవరోధం లేకుండా వుంటుంది. ఫిల్లోక్రాన్లు దశలు, పిలకల సంఖ్య ఈ విధంగా వుంటుంది. శ్రీ పద్దతిలో జరిగేది ఇదే.